Tamilnadu: తమిళనాడులో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. మొత్తం 5.57 కోట్ల మంది ఓటర్లు..
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో సోమవారం తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. గత ఎన్నికలతో పోల్చితే 74 లక్షల మంది ఓటర్ల సంఖ్య తగ్గడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు నమోదు అయ్యారు. అయితే 'సర్' ప్రక్రియ అనంతరం గతేడాది డిసెంబర్ 19న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్యను 5.43 కోట్లుగా ఈసీ పేర్కొంది.
వివరాలు
ఫిబ్రవరి 23న రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల
అంటే, దాదాపు 97లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. ఆ తర్వాత తమ పేర్లు తొలగించబడ్డాయని భావించిన వారికి అభ్యంతరాలు వ్యక్తపరచేందుకు కొంత గడువు ఇచ్చారు. అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత 27.53 లక్షల మంది అర్హులైన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చారు. అదే సమయంలో 4.23 లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించారు. ఫిబ్రవరి 23న రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రకటించారు. అందులో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా చూస్తే గత గణాంకాలతో పోలిస్తే 74 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గినట్టుగా తేలింది.
వివరాలు
27-శోలింగనల్లూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 5.36 లక్షల మంది ఓటర్లు
జిల్లాల వారీగా పరిశీలిస్తే, చెంగల్‌పట్టు జిల్లాలోని 27-శోలింగనల్లూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 5.36 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. మరోవైపు, చెన్నైలోని 18-హార్బర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. తమిళనాడు ప్రస్తుత శాసనసభ గడువు ఈ ఏడాది మే నెలలో ముగియనుంది. దానికి ముందుగానే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్యలో ఈసీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఎన్నికలతో నటుడు విజయ్ తన టీవీకే పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డీఎంకే కూటమి, భాజపా-అన్నాడీఎంకే కలయిక, టీవీకే పోటీతో ఈసారి ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.