EC: ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్,తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రాష్ట్రాలకే కాకుండా అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో కూడా ఒకే సమయంలో పోలింగ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి నెల మధ్యలో విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల పరిస్థితిని పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే పర్యటనలు ప్రారంభించగా, ప్రస్తుతం వారు అస్సాంలో ఉన్నారు.
వివరాలు
తుది దశకు 'సర్' ప్రక్రియ
పుదుచ్చేరి అసెంబ్లీ పదవీకాలం జూన్ 15తో ముగియనుండగా, అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలాలు మే నెలలో ముగియనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఈసీ చేపడుతున్న 'సర్' ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. పుదుచ్చేరి ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 14న విడుదల చేయగా, తమిళనాడు తుది జాబితాను నేడు ప్రకటించనున్నారు. ఇక అస్సాంలో ఫిబ్రవరి 10న, కేరళలో ఫిబ్రవరి 21న, పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితాలు వెలువడనున్నాయి.