Cash-for-Job Scam: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం.. ఒక్కో ఉద్యోగానికి రూ.35 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో నియామకాలు జరపడానికి సంబంధించి అభ్యర్థుల నుంచి ఒక్కొక్కరికి రూ.25 నుండి రూ.35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్టు సమాచారం బయటపడింది. ఓ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిర్వహించిన సోదాల సమయంలో ఈ "క్యాష్ ఫర్ జాబ్" స్కాం బట్టబయలైనట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో,ఈడీ అధికారులు తమిళనాడు పోలీసు విభాగానికి అధికారిక లేఖ పంపినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం,ఈ అవినీతి వెనుక ప్రముఖ రాజకీయ నేతలు,ప్రభావవంతులైన వ్యక్తులు ఉన్నారని ఈడీ ఆరోపించినట్టు తెలిసింది.
వివరాలు
2,538 మంది ఎంపిక
2024లో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలోని అసిస్టెంట్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వంటి పలు పోస్టుల కోసం నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 1.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,పరీక్షల అనంతరం 2,538 మందిని ఎంపిక చేశారు. ఈ నియామక ఉత్తర్వులను ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వయంగా అందజేశారు. కానీ,ఈడీ దర్యాప్తులో ఆ నియామకాలలో తీవ్ర అవకతవకలు జరిగాయని తేలింది. సుమారు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్ష ఫలితాలను తారుమారు చేశారని, ఇందుకోసం భారీ లంచాలు తీసుకున్నారని తెలిపింది. ప్రతి అభ్యర్థి నుంచి రూ.25-35 లక్షల వరకు తీసుకున్నట్టు ఈడీ నివేదిక పేర్కొంది.
వివరాలు
అన్నా యూనివర్సిటీపై కూడా విచారణ జరపాలంటూ ఈడీ సూచన
ఈ వ్యవహారానికి రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ తమిళనాడు పోలీసు విభాగాధిపతికి ఈడీ లేఖ రాసి, 232 పేజీల ఆధారాలను సమర్పించింది. ఈ నియామక పరీక్షలను నిర్వహించిన అన్నా యూనివర్సిటీపై కూడా విచారణ జరపాలంటూ ఈడీ సూచించింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ కథనాన్ని తమ సోషల్ మీడియా వేదికలపై పంచుకుంటూ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించింది.
వివరాలు
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ కుంభకోణం అంశం కీలకంగా మారనుంది
అయితే, ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి స్టాలిన్ గానీ ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. రాబోయే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కుంభకోణం రాజకీయంగా కీలక చర్చా అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.