ED: తప్పుడు అక్రిడేషన్‌తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్‌గా మారింది. విచారణలో భాగంగా, సరైన అక్రిడేషన్ లేని పరిస్థితుల్లోనే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మొత్తం రూ.415.10 కోట్లను ఫీజుల రూపంలో వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ మొత్తాన్ని యూనివర్సిటీ 'స్వచ్ఛంద విరాళాలుగా' చూపించినట్లు కూడా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోయినా విశ్వవిద్యాలయాన్ని నడుపుతూ, విద్యార్థుల నుంచి భారీగా డబ్బు తీసుకున్నారని ఆరోపించారు.
వివరాలు
సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు పురోగమిస్తుండగా, యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, ట్రస్టీల ఇళ్లలో జరిగిన సోదాల అనంతరం, సంస్థ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. సోదాల్లో రూ.48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2014-15 నుండి 2024-25 ఆర్థిక సంవత్సరాల వరకు సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో కూడా ఫీజుల ద్వారా వచ్చిన డబ్బును 'విరాళాలు' అని చూపించినట్లు విచారణలో బయటపడింది. ఈ అక్రమ నిధులను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్‌కు రెండు సమన్లు
ఇదిలావుంటే, ఇటీవల ఫరీదాబాద్‌లో గుర్తించిన ఉగ్ర మాడ్యూల్ సభ్యులకు అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి రావడంతో ఈ సంస్థ పేరు మరోసారి చర్చకు వచ్చింది. ఈ సంబంధాలు బయటపడిన వెంటనే ఇండియన్ యూనివర్సిటీల అసోసియేషన్ (AIU) యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, ఢిల్లీ పోలీసులు ఫోర్జరీ, మోసం ఆరోపణలపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదే సమయంలో, న్యాక్ కూడా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు పంపింది. తమ వెబ్‌సైట్‌లో అక్రిడేషన్ గురించి తప్పుదారిపట్టించే సమాచారాన్ని చూపించారన్న కారణంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్‌కు సోమవారం రెండు సమన్లు పంపించినట్లు అధికారులు తెలిపారు.