Delhi excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఈడీ
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ (పర్సనల్ అసిస్టెంట్)వైభవ్ కుమార్,ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారంనాడు విచారించింది. PMLA నిబంధనల కింద కుమార్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. గతంలో కూడా ఈ ఇద్దరినీ ఈడీ ప్రశ్నించింది. దుర్గేష్ పాఠక్ సోమవారం ఉదయం ఈడీ ముందు హాజరయ్యారు. 2022 సెప్టెంబర్‌లో ఆప్ నేత విజయ్ నాయర్ ఇంటిపై ఈడీ దాడులు జరిపినట్టు దుర్గేష్ పాఠక్ అక్కడే ఉన్నారు. ఆ సాయంలో పాఠక్ ఫోనును ఈడీ స్వాధీనం చేసుకుంది.
''జైల్ కా జవాబ్ ఓట్ సే'' ఆప్ పార్టీ సరికొత్త థీమ్
ఫిబ్రవరి 23, 2023న, నిందితుడు సమీర్ మహేంద్రు కోసం వైభవ్ కుమార్ ఏర్పాటు చేసిన కాల్ గురించి ఆర్థిక దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. కాగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సంఘీభావంగా ఆప్ పార్టీ సరికొత్త థీమ్‌తో ఎన్నికల ప్రచారానికి సోమవారం శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ''జైల్ కా జవాబ్ ఓట్ సే'' (Jail Ka Jawab Vote Se) ప్రచారాన్ని ప్రారంభించింది. 'ఆప్' పోటీచేస్తున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తారని 'ఆప్' నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.