Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ
మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బృందం సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంటి వద్దకు చేరుకుంది. దిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఖాన్ అక్రమ నియామకాలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖాన్ తన ఇంటికి ఈడీ బృందం వచ్చినట్లు పేర్కొంది. తనను అరెస్టు చేయడానికి ఈడీ తన ఇంటికి వచ్చిందని అని ఖాన్ ఎక్స్ లో పోస్టు చేశారు.
స్పందించిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి
ఇక ఖాన్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ బలగాలు మోహరించబడ్డాయి. మద్యం పాలసీ కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఈడీకి ఇక మిగిలింది ఇదే పని అని, బీజేపీపై లేవనెత్తిన ప్రతి గొంతును అణచివేయడమే వారి లక్ష్యమని చెప్పారు. ఖాన్‌పై ఈడీ కేసు 2018 నుండి 2022 మధ్య కాలంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను చట్టవిరుద్ధంగా లీజుకు తీసుకుని, సిబ్బందిని నియమించుకుని ఆర్థిక లాభాలు పొందారనే ఆరోపణలను చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థ గతంలో ఖాన్‌ను 12 గంటలకు పైగా ప్రశ్నించిన విషయం తెలిసిందే.