Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు
ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను మహాబలిపురం-కరైకల్ మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. చెన్నై నగరంలోని ఏడు సబ్‌వేలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని ప్రత్యేక పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాను తీరం దాటినప్పటికీ, ఇంకా 24 గంటల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
రాయలసీమలో భారీ వర్షాలు
తమిళనాడు, రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు కురవడమే కాకుండా, ఆ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.