Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి, మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
విజయనగరం జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 390 కి.మీ., విశాఖకు దక్షిణంగా 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 5 కి.మీ. వేగంతో ఈశాన్య దిశగా కదులుతూ, ఏపీ తీరానికి సమాంతరంగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. గోపాలపట్నం ఇందిరానగర్‌లో ప్రహరీ కూలిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి, కారుమబ్బులు వాతావరణాన్ని మరింత చల్లగా మారుస్తున్నాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల తీవ్రత దృష్ట్యా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విద్యార్థుల భద్రత కోసం జిల్లా ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రధాన పోర్టుల వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. ఏపీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.