LOADING...
Tenali: తెనాలిలో మూడు కాలువల అభివృద్ధికి కసరత్తు.. సంక్రాంతి కల్లా పడవల కాలువలో బోటు షికారు
సంక్రాంతి కల్లా పడవల కాలువలో బోటు షికారు

Tenali: తెనాలిలో మూడు కాలువల అభివృద్ధికి కసరత్తు.. సంక్రాంతి కల్లా పడవల కాలువలో బోటు షికారు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ముచ్చటగా విస్తరించిన మూడు కాలువలతో "ఆంధ్రా ప్యారిస్"గా పేరుపొందిన తెనాలి పట్టణానికి ప్రత్యేకమైన చారిత్రక గుర్తింపు ఉంది. ఎక్కడ చూసినా నీటి అలికిడి, ఆకర్షించే పచ్చదనం ఈ పట్టణానికి ఓ ప్రత్యేక ముద్రవేసాయి. ఇలాంటి తెనాలిలోని మూడు కాలువలను అభివృద్ధి చేసి పర్యాటకులను మెప్పించాలన్న ఆలోచన ఏళ్లుగా ఉన్నప్పటికీ, దానిని ముందుకు తీసుకెళ్లే చర్యలు అంతగా వేగం పట్టలేదు. అయితే, కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్రాంతి నాటికి బోటు షికారు ప్రారంభించేలా, అలాగే వచ్చే రెండేళ్లలో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు జరుగుతున్నాయి.

వివరాలు 

చారిత్రక నేపథ్యం 

కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణానంతరం బ్రిటీష్ ప్రభుత్వం విజయవాడ నుంచి నిజాంపట్నం వరకు ఉన్న కాలువల లోతును పెంచి,కట్టలను బలోపేతం చేసింది. ఈ ప్రక్రియలో తెనాలి నుంచి తూర్పు కాలువ,పడవల కాలువ (నిజాంపట్నం వైపు)పడమర కాలువలు మరింత మెరుగుపడ్డాయి. వీటి ద్వారా తెనాలి,వేమూరు,నిజాంపట్నం,బాపట్ల ప్రాంతాల్లో కలిపి దాదాపు 90 వేల ఎకరాల వ్యవసాయ భూభాగానికి సాగునీరు,తాగునీరు అందుతోంది. తెనాలి రక్షిత మంచినీటి పథకానికీ ఇదే నీటి వనరు. ఒకప్పుడు నిజాంపట్నం కాలువపై పడవల ద్వారా సరకు రవాణా జరిగేది కూడా. ఇంత ముఖ్యమైన కాలువలు గత కొన్నేళ్లుగా మురుగు నీరు,చెత్త కారణంగా పెద్ద సమస్యలుగా మారాయి. పట్టణంలో దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్లే ఈ కాలువలు ఆక్రమణలతో నిండిపోయిన పరిస్థితి రెండేళ్ల క్రితమే కనిపించేది.

వివరాలు 

గతంలో జరిగిన ప్రయత్నాలు 

కాలువల నుంచి ఆక్రమణలను తొలగించి, కట్టలను అభివృద్ధి చేయాలని గత పాలకులు అనేకసార్లు సంకల్పించినప్పటికీ అడుగులు నెమ్మదిగా పడాయి. మొదట నాదెండ్ల మనోహర్ రెండు కాలువల మధ్య రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టగా, ఆ తరువాత ఆలపాటి రాజా ఆ పనిని కొనసాగించారు. తదుపరి ప్రభుత్వ కాలంలో పట్టణ పరిధిలో సగం కిలోమీటరు మేర బండ్ నిర్మాణం చేసి, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నాదెండ్ల మనోహర్ మళ్లీ కాలువలపై దృష్టి పెట్టారు. టన్నుల కొద్దీ చెత్తను తొలగించే పనులు పూర్తయ్యాయి. మురుగునీరు కాలువల్లోకి ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని పురపాలకసంఘానికి ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

భవిష్యత్తు ప్రణాళికలు 

సంక్రాంతి నాటికి బోటు షికారు ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. బండ్‌ల సుందరీకరణ, బోటు ఎక్కే.. దిగే పాయింట్ల గుర్తింపు, ప్రజలకు అవసరమైన స్టాల్స్ ఏర్పాటుపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించిన ఆకాశ నడక వంతెన ప్రాజెక్టు అప్పటి నుంచి ముందుకు కదల్లేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును అమలు చేసే దిశగా మళ్లీ చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి కావాల్సిన ఖర్చు, సాధ్యాసాధ్యాలు, స్థల పరిమితులు వంటి అంశాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.