LOADING...
ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత

ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం

వ్రాసిన వారు Stalin
Jan 16, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎనిమిదో నిజాం ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల ముకరం జా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు కొడుకులు ఉన్నా.. ఆయన వారసుడిగా మనవడు అయిన ముకరం జానే ప్రకటించారు. దీంతో ఎనిమిదో నిజాంగా ముకరం జా గుర్తింపు పొందారు. ముకరం జా కోరిక మేరకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం జా పార్థివదేహాన్ని ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి.. చౌమహల్లా ప్యాలెస్‌లో సందర్శనకు ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం వారి సంప్రదాయ కార్యక్రమాలను పూర్తి చేశాక.. అసఫ్ జాహీ సమాధుల వద్ద పార్దీవ దేహాన్ని ఖననం చేయననున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ముకరం జా

1980 వరకు భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముకరంజానే

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజం జా- షెహ్వార్‌రకు అక్టోబర్ 6, 1933న ముకరం జా జన్మించారు. జూన్ 14, 1954న ముకరం జాను తన వారసుడిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించారు. 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా ముకరం జా గుర్తింపు పొందారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడం వల్ల.. ఆయన బిరుదులను కోల్పోయారు. ఆస్తులన్నీ స్తంభించిపోయాయి. 1980 వరకు భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ముకరం జా ఉన్నారు. ముకరం జా మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ముకరం జా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ముకరం జా పార్ధీవ దేహం హైదరాబాద్‌కు చేరుకోనుంది.