Loading...
El Niño Impact: తెలంగాణలో భిన్న వాతావరణం.. పగలు ఎండలు, రాత్రి చలి
తెలంగాణలో భిన్న వాతావరణం.. పగలు ఎండలు, రాత్రి చలి

El Niño Impact: తెలంగాణలో భిన్న వాతావరణం.. పగలు ఎండలు, రాత్రి చలి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు.. పగటిపూట ఎండ తీవ్రత, రాత్రివేళ చలి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండగా.. రాత్రి సమయాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. పగటిపూట 2 నుంచి 4 డిగ్రీలు అధికం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

వివరాలు 

ఎల్‌నినో ప్రభావంతోనే ఈ పరిస్థితులు

నవంబరు రెండో వారంలోకి ప్రవేశించడంతో క్రమంగా చలి పెరగాల్సి ఉంది.

అయితే అందుకు భిన్నంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

ప్రస్తుతం ఎల్‌నినో తీవ్ర దశలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

మరో రెండు నెలలపాటు ఎల్‌నినో తీవ్ర దశ కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో పగటిపూట ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా ఉంటున్నాయి.

రాత్రివేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే.. పగటిపూట భూమి గ్రహించిన వేడి తిరిగి ఆకాశంలోకి ప్రసరిస్తుంది.

దీంతో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.

వివరాలు 

ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత

ఈ కారణంగా రాత్రిపూట సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పగటిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నాయి.

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ముఖ్యంగా కుమురం భీమ్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.

ఇదిలా ఉండగా.. రానున్న ఏడు రోజుల్లో తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురిసే సూచనలు లేవని వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు.

ADVERTISEMENT