
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా పోలింగ్ తేదీలు,ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రకటన ప్రకారం, నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుందని పేర్కొంది. అదే రోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనుంది. 22వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించి, స్క్రూటిని ప్రక్రియ పూర్తి చేయనుంది.
వివరాలు
జూన్‌లో గుండెపోటు కారణంగా మాగంటి గోపీనాథ్ మృతి
తదుపరి, వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ తర్వాత, 14వ తేదీన కౌంటింగ్ చేసి, ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. అయితే, ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటు కారణంగా కన్నుమూశారు. దీని వల్ల ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌కు టికెట్‌ను కేటాయించింది.
వివరాలు
కాంగ్రెస్ అధిష్టానానికి ముగ్గురి పేర్లు
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ సీటుపై అభ్యర్థులుగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సి.ఎన్. రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.