Janasena: గాజు గ్లాస్ గుర్తుపై ఈసీ వివరణ
ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం హై కోర్టుకు వివరణ ఇచ్చింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఈసీ తెలిపింది. అలాగే రెండు లోక్ సభ స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది. దీంతో.. జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని తెలిపింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే..
అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును వేరే వారికి కేటాయించవద్దని జనసేన ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ, గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్ల ఇవ్వడం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈసీ నివేదిక మేరకు జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో జనసేనకు ఈ అంశంపై ఊరట లభించనట్లయింది. !