
Bihar Elections: బిహార్ ఎన్నికల షెడ్యూల్‌పై ఇవాళ సాయంత్రం ఈసీ ప్రెస్‌మీట్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల చివరి వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. ఈ క్రమంలో ఈసీ సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించి ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ఈవిషయాన్ని ఇప్పటికే ఈసీ అధికారికంగా ధృవీకరించింది.బిహార్‌లో మొత్తం 243శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ వ్యవధి వచ్చే నెల చివరి వారంలో ముగియనుంది.కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఇప్పటికే వెల్లడించినట్లుగా,నవంబర్ 22 వరకు పోలింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సాధారణంగా మూడు విడతలలో నిర్వహించే అవకాశమే ఎక్కువ.ఈసీ బృందం ఇప్పటికే రెండు రోజుల పాటు బిహార్‌లో పర్యటన చేసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నద్ధతలను సమీక్షించింది.
వివరాలు
ప్రత్యేక సవరణలతో ఓటర్ల జాబితా సిద్ధం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని,తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోలతో కూడిన బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రత్యేక సవరణలతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసినట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన సార్వత్రిక ఆధిక్యం లభించకపోవడంతో, జేడీయూ,భాజపా పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వివరాలు
మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్
కానీ, రెండేళ్లకే నీతీశ్ కుమార్ ఎన్డీయేను వీడి, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీతో కూడిన మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి పదవికి బాధ్యత స్వీకరించారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో జేడీయూ పార్టీ మహాగఠ్‌బంధనాన్ని విడిచి, మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకే, నీతీశ్ కుమార్ మరోసారి బిహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.