Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పక్కన పెట్టడం గమనార్హం. మార్చిన స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. దిల్లీలో ఐదుగురు కొత్త వారికి అవకాశం ఇవ్వగా.. అందులో నలుగురు సిట్టింగ్ ఎంపీల స్థానాలు ఉండటం విశేషం. ముఖ్యంగా పర్వేష్ సింగ్ వర్మ, జయంత్ సిన్హా, సాధ్వి సింగ్ ప్రజ్ఞా ఠాకూర్, రమేష్ బిధూరి వంటి వివాదాస్పద ఎంపీలను బీజేపీ కేంద్రం నాయకత్వం పక్కన పెట్టింది.
వ్యూహంతోనే వారిని పక్కన పెట్టిన బీజేపీ
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకుపోతోంది. ఇదే సమయంలో అనుకున్న 370 స్థానాల్లో విజయం సాధించేందుకు వివాదాలు లేని, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను బరిలోకి దింపాలని బీజేపీ భావించింది. గాడ్సే, కర్కరేపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌లో భోపాల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌కు టికెట్ కేటాయించలేదు. అలాగే, పార్లమెంటులో చంద్రయాన్-3 మిషన్ విజయంపై చర్చ సందర్భంగా అవమానకరమైన వ్యాఖ్యల చేసిన దక్షిణ దిల్లీ ఎంపీ బిధురిని కూడా మార్చారు.
దిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కుమార్తె పోటీ
చందానీ చౌక్ నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా ఉన్న హర్షవర్ధన్‌ను బీజేపీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో ప్రవీణ్ ఖండేల్‌వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పశ్చిమ దిల్లీలో రెండుసార్లు ఎంపీగా ఉన్న పర్వేష్ వర్మ స్థానాన్ని కమల్‌జీత్ సెహ్రావత్‌కు ప్రకటించింది. మీనాక్షి లేఖి సిట్టింగ్ స్థానం దిల్లీ లోక్‌సభ సీటును దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్‌ను పార్టీ కేటాయించింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి మరో సిట్టింగ్ ఎంపీ సిన్హా స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే మనీష్ జైస్వాల్‌ను నిలబెడుతోంది. 2017లో మాంసం వ్యాపారిని కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు సిన్హా సాయం అందిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి.