
Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరోసారి గరిష్ఠ స్థాయిని తాకింది. బుధవారం ఉదయం 7.55 గంటలకు 16,140 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు కావడం విశేషం.
ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును ఇది అధిగమించింది.
సాధారణంగా ఏటా మార్చిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు కావడం గమనార్హం.
పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు విద్యుత్ సంస్థలు విద్యుత్ కొనుగోలును మరింత పెంచాలని ప్రభుత్వానికి సూచించాయి.
విద్యుత్ సరఫరా, డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎక్కడా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
Details
భారీగా విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో రబీ సీజన్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో 29 లక్షల వ్యవసాయ బోర్ల ద్వారా భారీగా విద్యుత్ వినియోగం జరుగుతోంది.
అదనంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిశ్రమలు, గృహ వినియోగం పెరుగుదలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ మరింత అధికమవుతోంది.
ప్రస్తుత రబీ సీజన్ సాగు, పెరుగుతున్న ఎండల ప్రభావంతో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ వెల్లడించారు.
దీనిని సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన వంటి చర్యలను చేపట్టినట్లు ఆయన వివరించారు.