Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం హఠాత్తుగా మరణించారు. దెబ్రాయ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దెబ్రాయ్ తనకు చాలాకాలంగా తెలుసు అని, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాల్లో ఆయనకు గొప్ప ప్రావీణ్యం ఉందని మోదీ చెప్పారు. ఆయన మృతి ఎంతో బాధించిందని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ పేర్కొన్నారు.
విచారం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర
అలాగే, కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదాన్ కూడా దెబ్రాయ్ మృతికి విచారం వ్యక్తం చేశారు. బిబేక్ దెబ్రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన తర్వాత పూణేలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో ఛాన్సలర్‌గా, దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో ఉద్యోగం చేశారు. 2019 వరకు దెబ్రాయ్ నీతి అయోగ్‌లో సభ్యుడిగా వ్యవహరించారు. ఆర్థికశాస్త్రంలో ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది.