Maoists Encounter: బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా ఆరుగురు మావోయిస్టులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని నమోదు చేశాయి. బీజాపూర్ జిల్లా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. భోపాలపట్నం-ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు జనవరి 17న ప్రత్యేక సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ బీజాపూర్, డీఆర్‌జీ దంతేవాడ, ఎస్‌టీఎఫ్, కోబ్రా బలగాల (202, 206, 210 బెటాలియన్లు)తో పాటు సీఆర్‌పీఎఫ్ 214 బెటాలియన్‌కు చెందిన సంయుక్త బృందాలు పాల్గొన్నాయి.
Details
దిలీప్ బెండ్జాపై రూ.8లక్షల రివార్డు
ఆపరేషన్ సందర్భంగా జనవరి 17 ఉదయం నుంచి 18 సాయంత్రం వరకు భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య మధ్య మధ్యలో తీవ్ర కాల్పులు జరిగాయి. అనంతరం నిర్వహించిన గాలింపుల్లో రూ.8 లక్షల రివార్డు ఉన్న డీవీసీఎం దిలీప్ బెండ్జాతో పాటు ఏసీఎం మాడ్వీ కోసా, ఏసీఎం పాలొ పొడియం, ఏసీఎం లక్కీ మడ్కం, పీఎం జుగ్లో బంజామ్, పీఎం రాధా మేట్టా మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మావోయిస్టులపై మొత్తం రూ.27 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.