
Engineering Counselling: కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపని ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు కన్వీనర్ కోటాలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. టాప్ ర్యాంకులు పొందిన వారు ఐఐటీలు,నిట్‌లు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈఏపీసెట్‌లో 1 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఏపీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అదే విధంగా, 500లోపు ర్యాంకులు పొందినవారిలో 12మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులు ఐఐటీ, నిట్, బిట్స్ వంటి పేరుగాంచిన సంస్థల్లో చేరడానికి అడుగులు వేస్తున్నారు.
వివరాలు
58శాతం మంది ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో
వెయ్యిలోపు ర్యాంకులు వచ్చినవారిలో కేవలం 80 మంది మాత్రమే రాష్ట్రంలోని కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. ఇక 10 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 5,806 మంది,అంటే సుమారు 58 శాతం మంది ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులో చూస్తే, 50 వేల నుంచి లక్ష ర్యాంకుల మధ్య ఉన్న విద్యార్థులే అత్యధికంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరారు. ఇంజినీరింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో మెజారిటీ మంది సాఫ్ట్‌వేర్ రంగంతో సంబంధం ఉన్న బ్రాంచులనే ఎంచుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) విభాగంలో మొత్తం 47,519 సీట్లు ఉండగా, అందులో 41,504 సీట్లు భర్తీ అయ్యాయి.
వివరాలు
అంతా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినవే..
మిగిలిన 6,015 సీట్లు సాధారణంగా తరగతులు సక్రమంగా నిర్వహించని,ప్రాంగణ నియామకాలు సరిగా లేని కళాశాలల్లో ఉన్నవే. అదే విధంగా, CSE -ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI),మెషీన్ లెర్నింగ్(ML)విభాగాల్లో మొత్తం 16,665 సీట్లు ఉండగా, 13,602 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇక CSE-డేటా సైన్స్ విభాగంలో 8,043 సీట్లలో 5,912 సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ECE)విభాగంలో ఉన్న 25,250 సీట్లలో 18,846 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగంలో 8,564 సీట్లలో 5,155 సీట్లు నిండాయి. మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 7,743 సీట్లు ఉండగా, అందులో 4,653 మాత్రమే భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో మొత్తం 6,507 సీట్లలో 3,760 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.