Rahul Gandhi E20 Fuel: పెట్రోల్‌లో ఇథనాల్ కల్తీ? చమురు సంస్థలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా వాహనదారులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల ఫలితాలను ప్రస్తావిస్తూ శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "E20 కాస్తా 420గా మారింది.. ప్రజల కార్ల నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్నారు!" అంటూ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో తీవ్రంగా స్పందించారు. చమురు సంస్థలు నిర్వహించే పరీక్షా ప్రక్రియలో పారదర్శకత లేదని ప్రశ్నించారు.
వివరాలు
ఇథనాల్ శాతం 25.5 నుంచి 26.5 మధ్య ఉన్నట్లు గుర్తింపు
కర్ణాటక ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ నమూనాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించారు.
వీటిలో 11 నమూనాల్లో ఇథనాల్ శాతం 20కి మించి ఉన్నట్లు తేలింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన నమూనాలో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నమూనాలో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు పరీక్షా నివేదికలు వెల్లడించాయి.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), నయారా ఎనర్జీ, షెల్ సంస్థల నుంచి సేకరించిన ఇతర నమూనాల్లోనూ ఇథనాల్ శాతం 25.5 నుంచి 26.5 మధ్య ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
నమూనాలను సేకరించినట్లు సమాచారం
బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల నుంచి ఈ నమూనాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.
పెట్రోల్‌లో అధిక మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ తగ్గే అవకాశం ఉందని, ఇంజిన్‌లు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని మంత్రి రిజ్వాన్ అర్షద్ ఆందోళన వ్యక్తం చేశారు.
తొలుత ఈ పెట్రోల్ నమూనాలను ఆయిల్ కంపెనీల ప్రయోగశాలలకు పంపినప్పటికీ, అక్కడి నుంచి ఇథనాల్ శాతానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదని తెలిపారు.
దీంతో స్వతంత్ర ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు.