Page Loader
Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం
Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం

Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణ సమయంలోకంటే ముందే ప్రవేశించినప్పటికీ, భూగర్భ జలమట్టం మాత్రం కొంతమంది జిల్లాల్లో ఇంకా లోతులోనే ఉంది. జూన్ నెల ముగిసిపోయినప్పటికీ, గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. వర్షపాతం తక్కువగా ఉండటం, జలాశయాలు, చెరువుల్లోకి తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో ఈ స్థితి ఏర్పడింది. గత సంవత్సరం జూన్ నెలలో భూగర్భ జల మట్టం సగటు 9.90 మీటర్లుగా ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 9.47 మీటర్లకు చేరింది. అంటే సగటు 0.43 మీటర్ల పెరుగుదల కనిపించినప్పటికీ, ఇది తగినంతగా లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం ఇంకా లోతులోనే ఉంది. మరో నాలుగు జిల్లాల్లో మాత్రం అర మీటరులోపే పెరుగుదల నమోదైంది.

వివరాలు 

జూన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 2.19 మీటర్ల పెరుగుదల

ప్రస్తుతం రైతులు బోర్ల ద్వారా సాగు మొదలుపెట్టారు.అయితే,వానలు పడటంతో పాటు పాతాళ గంగమ్మ ఎప్పుడెప్పుడు పైకి వస్తుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,గత ఏడాది జూన్‌తో పోల్చితే ఈ సంవత్సరం జూన్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 2.19 మీటర్ల పెరుగుదల కనిపించింది. పెద్దపల్లి జిల్లాలో కేవలం 0.09 మీటర్ల పెరుగుదలే నమోదైంది. యాదాద్రి జిల్లాలో 1.81 మీటర్లు,ఆదిలాబాద్‌లో 1.21 మీటర్లు, మేడ్చల్‌లో 0.85, జనగామలో 0.81, సిద్దిపేటలో 0.79,మహబూబాబాద్‌లో 0.71, హనుమకొండ జిల్లాలో 0.69 మీటర్ల లోతులోనే భూగర్భ జలమట్టం ఉంది. మొత్తం 22 జిల్లాల్లో జలమట్టం పెరిగినప్పటికీ, కరీంనగర్,మంచిర్యాల,నిర్మల్,పెద్దపల్లి,వికారాబాద్‌ జిల్లాల్లో మాత్రం ఈ పెరుగుదల అర మీటరులోపే ఉంది.

వివరాలు 

రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితి: 

రాష్ట్రవ్యాప్తంగా ఈ జూన్ నెలలో సాధారణంగా కురవాల్సిన వర్షపాతం 130 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా కురిసింది 104 మిల్లీమీటర్లే. అంటే రాష్ట్రంలో మొత్తం 20 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో ఈ లోటు తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణంగా 107 మిల్లీమీటర్లు వర్షం పడాలి. కానీ కేవలం 29 మిల్లీమీటర్లే కురిసింది. ఇది సుమారు 73 శాతం లోటు. అయితే, కొన్ని జిల్లాల్లో మాత్రం సాధారణం కన్నా కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాధారణానికి 14 శాతం అధికంగా వర్షాలు పడగా, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటిగా 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

వివరాలు 

రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితి: 

వనపర్తిలో 6 శాతం, కామారెడ్డిలో 5 శాతం, ఆదిలాబాద్‌లో 3 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మొత్తంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షపాతం లోటుగా ఉంది. హైదరాబాద్, మేడ్చల్ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 56 శాతం వర్షపు లోటు నమోదైంది. జనగామలో 54 శాతం, పెద్దపల్లిలో 48 శాతం, సూర్యాపేటలో 44 శాతం, యాదాద్రిలో 42 శాతం, మంచిర్యాలలో 40 శాతం, నారాయణపేట జిల్లాలో 40 శాతం వర్షపాతం లోటుగా నమోదు కావడం గమనార్హం.