
Bengaluru College Student: ఒడిశా ఘటన మరువకముందే బెంగళూరులో విద్యార్థినిపై లెక్చరర్ల లైంగిక దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే, కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో పాఠశాల విద్యార్థిని తనపై జరిగిన అత్యాచారాన్ని, బ్లాక్‌మెయిల్‌ను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు ప్రముఖ కళాశాలకు చెందిన లెక్చరర్లు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం, ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, విద్యార్థిని చదువులో సహాయం చేస్తానని నమ్మించి పరిచయాన్ని పెంచుకున్నాడు.
Details
ముగ్గురు నిందితులు అరెస్టు
అనంతరం తన స్నేహితుడు అనూప్ గది వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బెదిరింపులు ప్రారంభమయ్యాయి. 'ఇది ఎవరికైనా చెబితే వీడియోలు విడుదల చేస్తాం' అంటూ నరేంద్ర మానసికంగా వేధించాడు. అనంతరం బయాలజీ లెక్చరర్ సందీప్ తన గదిలో విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడు. ఇదే వీడియో ఆధారంగా అనూప్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. ఈ ఘోర ఘటనలతో తీవ్ర మానసిక వేదనకు గురైన విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. వారు వెంటనే మహిళా కమిషన్‌ను ఆశ్రయించగా, పోలీసుల దర్యాప్తుతో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు.
Details
మహిళల భద్రతపై తీవ్ర చర్చ
ఇక మరోవైపు, ఒడిశాలో ఇటీవల కాలేజీ ప్రాంగణంలోనే ఒంటికి నిప్పంటించుకున్న యువతి... చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. శరీరం 90 శాతం కాలిపోయిందని, అన్నివిధాలుగా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. లెక్చరర్ వేధింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో మహిళల భద్రతపై తీవ్ర చర్చ నడుస్తోంది.