Page Loader
PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం
'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం

PM Modi: 'సంతకమైనా తమిళంలో చేయండి'.. నేతల తీరుపై మోదీ అసహనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడుకు కేంద్రం గణనీయంగా నిధులు పెంచినప్పటికీ, కొందరు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామేశ్వరం పాంబన్‌ వంతెన ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం కేవలం రూ.900 కోట్లు కేటాయించేవారని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.6,000 కోట్లు కేటాయించిందని వివరించారు. ఇది ఏకంగా ఏడు రెట్లు ఎక్కువ కేటాయింపు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోదీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Details

తమిళ  సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం చర్యలు 

ముఖ్యంగా వైద్య విద్యను తమిళ భాషలో అందించాలన్న ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని ద్వారా పేదలకు మరింతగా ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. తమిళ భాష, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. అయితే, కొందరు రాజకీయ నాయకులు సంతకాలను తమిళంలో చేయడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం అధికారిక సంతకాలను అయినా తమిళంలో చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

Details

అద్భుతంగా పాంబన్‌ వంతెన 

రామేశ్వరం వద్ద నిర్మించిన పాంబన్‌ వంతెనను ప్రధాని మోదీ 21వ శతాబ్దపు అత్యద్భుత ఇంజినీరింగ్‌ ప్రాజెక్టుగా కొనియాడారు. వంతెన ఆధునికీకరణ కోసం గత కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ఇది కేవలం రవాణా వేదిక మాత్రమే కాకుండా ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధికి కూడా తోడ్పడతుందని పేర్కొన్నారు.

Details

మూడు ప్రధాన వంతెనల గౌరవం 

తమ ప్రభుత్వం దేశానికే గర్వకారణంగా నిలిచే మూడు అద్భుత వంతెనలను నిర్మించింది. ముంబయిలో సముద్ర వంతెన, జమ్మూకశ్మీర్‌లో చినాబ్‌ వంతెన, రామేశ్వరం వద్ద పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెన ఇవే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన చినాబ్ నదిపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయిలో నిర్మించాం. దక్షిణాదిలో అత్యాధునిక వర్టికల్‌ లిఫ్ట్‌ వంతెనను పాంబన్‌లో నిర్మించామని వివరించారు. అంతేకాక, భారతరత్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పుట్టిన స్థలం అయిన రామేశ్వరం టెక్నాలజీ, ఆధ్యాత్మికత కలగలిసిన పవిత్ర భూమిగా నిలుస్తుందని మోదీ కొనియాడారు.