LOADING...
Election Commission: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన

Election Commission: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు సర్వం సిద్ధం.. నేడే ఈసీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటిగ్రేటెడ్‌ రివిజన్‌ - ఎస్ఐఆర్‌)పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బిహార్‌లో ఇటీవల ప్రారంభించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ చేపట్టడానికి ఈసీ సిద్ధమవుతోంది. తొలి దశలో 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ మొదటి దశలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Details

ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉండాలి

ఎస్ఐఆర్‌ అమలు కోసం ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను (సీఈవోలు) ఇప్పటికే సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఈవోల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఈసందర్భంగా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల పరిస్థితులను సమీక్షించడమే కాకుండా, ఎస్ఐఆర్‌ అమలులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఎన్నికల సంఘం ప్రకారం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో చివరిసారిగా ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ 2002-2004 మధ్య జరిగింది.

Details

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్‌ చేపట్టాలని నిర్ణయం

ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలు గడవడంతో, నకిలీ ఓటర్లను తొలగించి జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడటం అత్యవసరమైందని ఈసీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. ఆ తీర్పుతో మరింత ధైర్యం పొందిన ఈసీ, ఇప్పుడు సమగ్ర చర్యలకు ముమ్మరంగా సిద్ధమవుతోంది.