'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది. దర్యాప్తును అత్యంత వేగంగా చేపట్టాలని, ఈ కేసులో దాగి ఉన్న కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సీబీఐని ఆదేశించింది. ఇదిలా ఉంటే, విచారణ చాలా నెమ్మదిగా సాగుతోందని సోమవారం సీబీఐపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన శివశంకర్ రెడ్డి (ఏ5) భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా సీబీఐ పరిధిలోని కేసు పురోగతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసును కొత్త అధికారికి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశం
కేసు విచారణ నెమ్మదిగా సాగుతున్నదని గమనించిన జస్టిస్ షా, ఈ కేసును ఎంతకాలం దర్యాప్తు చేస్తారని సీబీఐని ప్రశ్నించారు. సీబీఐ చాలా కాలంగా 'రాజకీయ కుట్ర'పైనే వాదిస్తోంది కానీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో లోతైన కుట్రను ఛేదించలేకపోయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులోని కుట్ర భాగాన్ని తగినంతగా దర్యాప్తు చేయకపోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కేసును కొత్త అధికారికి అప్పగించాలని ఆదేశిస్తూ.. ప్రస్తుత అధికారి రామ్ సింగ్ కూడా అందులోనే కొనసాగుతారని జస్టిస్ ఎంఆర్ షా చెప్పారు.