ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని ఏప్రిల్ 5న విచారించడానికి అంగీకరించింది.
దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ 14 రాజకీయ పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
సుప్రీంకోర్టు
అరెస్టుకు ముందు, తర్వాత మార్గదర్శకాలను చెప్పండి: న్యాయవాది సంఘ్వీ
దర్యాప్తు సంస్థలు ఏలా వ్యవహరించాలనే దానిపై మార్గదర్శకాలను కోరుతూ సింఘ్వీ సుప్రీంకోర్టు ఎదుట పిటిషన్‌ను సమర్పించారు.
ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నాయని, 95 శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపై ఉన్నాయని న్యాయవాది సింఘ్వీ అన్నారు. అరెస్టుకు ముందు మార్గదర్శకాలు, అరెస్టు తర్వాత మార్గదర్శకాలను తాము అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని 14రాజకీయ పార్టీలు చెబుతున్నాయని న్యాయవాది సంఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.
డీఎంకే, రాష్ట్రీయ జనతా దళ్, భారత రాష్ట్ర సమితి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్‌సీపీ, శివసేన ఉద్ధవ్ క్యాంపు, జార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఐ, జేడీయూ, సీపీఎం, ఎస్పీ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.