ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు
మరణశిక్షను అమలు చేసే కేసుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలులో భాగంగా మెడకు తాడును వేలాడిదీసి ఉరివేయడం క్రూరమైన చర్యగా చెబుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే తక్కువ బాధతో మరణశిక్షను అమలు చేసే పద్ధతులను అన్వేషించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఉరితీయడం కంటే, తక్కువ బాధతో మరణ శిక్షను అమలు చేసే పద్ధతి ఏదైనా ఉందా? దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని అటార్నీ జనరల్ వెంకటరమణిని ధర్మాసనం కోరింది. మరణ శిక్ష విధించిన దోషులకు నొప్పిలేకుండా మరణించే అవకాశం ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు తెలిపింది.
తదుపరి విచారణ మే2వ తేదీకి వాయిదా
విచారణ సమయంలో ఉరి తీయడం క్రూరమైన చర్యగా లా కమిషన్ నివేదికను లాయర్ రిషి మల్హోత్రా కోట్ చేశారు. అది వాస్తవమేనని, అయితే ఈ విషయంలో తమకు కొంత సైంటిఫిక్ డేటా కావాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. తమకు అందిన సమాచారం మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే2వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు సైతం ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ను అమెరికాలో ఉపయోగిస్తున్నారని, అది పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని జస్టిస్ నరసింహ అన్నారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌లో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారనే దానిపై కూడా పరిశోధన చేయాలని న్యాయమూర్తులు సూచించారు.