Balakot Airstrikes: బాలాకోట్ దాడి వెనుక మిగ్-21ను ఎందుకు మాత్రమే ఉపయోగించారు?: రహస్యాన్ని వెల్లడించిన వాయుసేన మాజీ చీఫ్ బీఎస్ ధనోవా
ఈ వార్తాకథనం ఏంటి
2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై వైమానిక దాడులు నిర్వహించిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కీలక సమయంలో పాకిస్థాన్ వద్ద అత్యాధునిక ఎఫ్-16 ఫైటర్ జెట్లు ఉండగా, భారత వాయుసేన (IAF) మిగ్-21 యుద్ధ విమానాలను రంగంలోకి దింపడంపై అప్పట్లో అనేక ప్రశ్నలు వచ్చాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను తాజాగా భారత వాయుసేన మాజీ చీఫ్ బీఎస్ ధనోవా వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వివరించారు.
వివరాలు
మిగ్-21లను పంపడంపై ఆందోళనలు
బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో మరింత ఆధునిక యుద్ధ విమానాలను ఉపయోగించకుండా మిగ్-21లను పంపడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయని ధనోవా గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ఆయన.. అది ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా తీసుకున్న నిర్ణయం కాదని, యుద్ధభూమిలో ఉన్న వాస్తవ పరిస్థితులను బట్టి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు. ఆ సమయంలో శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో మిగ్-21 విమానాలే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆ భౌగోళిక పరిస్థితులు, వాతావరణానికి మిగ్-21కు మించిన ఫైటర్ జెట్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సుఖోయ్-30 వంటి భారీ యుద్ధ విమానాలు ఆ పరిస్థితుల్లో డాగ్‌ఫైట్‌కు అంతగా అనుకూలంగా ఉండవని తెలిపారు. అందువల్ల వేరే మార్గం లేక మిగ్-21లను రంగంలోకి దింపాల్సి వచ్చిందని వివరించారు.
వివరాలు
డాగ్‌ఫైట్ అంటే..
శత్రువు దాడి చేస్తున్న సమయంలో మన వద్ద ఉన్న వనరులతోనే పోరాడాల్సి ఉంటుందని, రఫేల్ జెట్లు అప్పటికి అందుబాటులో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ప్రధాని కూడా వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డాగ్‌ఫైట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైటర్ జెట్ల మధ్య అతి సమీపంలో జరిగే గగన పోరాటం అని వివరించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి వైమానిక దాడులు చేపట్టింది.
వివరాలు
శత్రువుల చెరలో అభినందన్ వర్ధమాన్
తెల్లవారుజామున బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీని తర్వాత పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. అయితే భారత వాయుసేన అప్రమత్తంగా వ్యవహరించి ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘర్షణల్లో భారత మిగ్ విమానం ఒకటి కూలిపోగా, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువుల చెరలో చిక్కుకున్నారు. అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో మూడు రోజుల తర్వాత పాకిస్థాన్ ఆయనను విడుదల చేసింది.