
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అంత్యక్రియలు జరగనున్నాయి. రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
వివరాలు
రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
దామోదర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం,ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. దామోదర్ రెడ్డి ప్రాణత్యాగం కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నష్టమని పేర్కొన్నారు.కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి మరణంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి కూడా సంతాపం తెలిపారు. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడు అని ఆయన దామోదర్ రెడ్డిని ప్రశంసించారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుని, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ రంగానికి బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. యువతకు అవకాశాలు కల్పించడంలో ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు.
వివరాలు
రాబోయే తరాలకు మార్గదర్శకం
ధైర్యం, రాజకీయ దూరదృష్టి, నిస్వార్థ ప్రజాసేవ దామోదర్ రెడ్డి రాజకీయ జీవన ప్రయాణంలోని ప్రధాన లక్షణాలు అని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజలతో కలిసిమెలిసి, వారి మధ్యే ఉండి సేవ చేయడం ఆయన వ్యక్తిత్వానికి ప్రత్యేకత అని పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం కాంగ్రెస్‌కే కాదు, మొత్తం తెలంగాణ రాజకీయ వర్గాలకు తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఆయన జీవన విధానం, ప్రజాసేవా తత్వం రాబోయే తరాలకు మార్గదర్శకమవుతుందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.