Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
ఈ వార్తాకథనం ఏంటి
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. గత ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ అధికారులు ఆయనను దాదాపు 12 గంటల పాటు విచారించారు. విచారణలో జోగి రమేశ్,ఆయన సోదరుడు రామును విడిగా, అలాగే కలిపి ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు.
వివరాలు
వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట
ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో ఉన్న సంబంధాలపై కూడా అధికారులు సవివరంగా ఆరా తీశారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కలిసి జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమై తెల్లవారుజామున ఐదు గంటలకు న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. మొదట వారిని విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించగా, తాజాగా అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తరలించినట్లు సమాచారం.