Sidiri Appalaraju: సీదిరి అప్పలరాజు అరెస్ట్.. కుమారుడి కేసులో కుట్ర ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ద్విచక్రవాహన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి సంబంధించిన కేసులో తన కుమారుడిని రక్షించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జీఎంఈ కాలనీలోని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పలరాజును పోలీసులు ఏ3గా చేర్చినట్లు వెల్లడించారు. ప్రమాదంలో తన కుమారుడు ప్రమేయం ఉన్నప్పటికీ, అతడిని కేసు నుంచి తప్పించి మరో యువకుడిపై నేరం మోపేలా కుట్ర జరిగిందని విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆధారాల మేరకు మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
వివరాలు
సమాచారం ముందే తెలిసి భారీగా కార్యకర్తల సమీకరణ
బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు అప్పలరాజు నివాసానికి చేరుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినట్లు సమాచారం అందడంతో ఆయన సాయంత్రం ఐదు గంటల వరకు ఇంటి తలుపులు తెరవకుండా లోపలే ఉండిపోయారు.
ఈ సమయంలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో చర్చలు జరిపినట్లు తెలిసింది.
అనంతరం అదనపు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఇంట్లోకి వెళ్లి అప్పలరాజును అదుపులోకి తీసుకుని బయటకు తీసుకొచ్చారు.
అరెస్టు సమాచారం ముందుగానే లీకైన నేపథ్యంలో అప్పలరాజు అనుచరులు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వైకాపా కార్యకర్తలను సమీకరించారు.
పోలీసులు వారిని ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.
వివరాలు
కార్యకర్తల భుజాలపై కూర్చుని.. పిడికిలి బిగించి
అయితే అప్పలరాజును బయటకు తీసుకువస్తున్న సమయంలో కార్యకర్తలు పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకుని ఇంటి వద్దకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. పోలీసుల వాహనంలో వెళ్లబోనని, తన అనుచరుల వాహనంలోనే వస్తానని అప్పలరాజు పట్టుబట్టినట్లు సమాచారం.
పోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనను భుజాలపైకి ఎత్తుకుని నినాదాలు చేశారు.
వారి భుజాలపై కూర్చున్న అప్పలరాజు పిడికిలి బిగించి కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చారు.
ఆయనను కారు వద్దకు తీసుకెళ్తున్నట్లు నటించిన కార్యకర్తలు తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆయనను కిందకు దించి తమ వాహనంలో ఎక్కించారు.
వివరాలు
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు అప్పలరాజు
పోలీసుల వాహనంలో అప్పలరాజుతో పాటు ఆయన భార్య శ్రీదేవి, చిన్న కుమారుడు, సోదరుడు త్రినాథరావు, న్యాయవాది, కాశీబుగ్గ రూరల్ సీఐ కూడా ప్రయాణించారు.
వాహనం ముందుకు కదలకుండా కార్యకర్తలు మరోసారి అడ్డుపడటంతో పోలీసులు రోప్ పార్టీ సాయంతో కాలనీ నుంచి పాత జాతీయ రహదారిపైకి వాహనాన్ని తరలించారు.
అనంతరం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో కూడా వైకాపా కార్యకర్తలు తమ వాహనాలతో వెంటాడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
చివరకు సాయంత్రం 7.30 గంటల సమయంలో అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వివరాలు
అప్పలరాజు కుమారుడి బెయిల్ డిస్మిస్
అరెస్టు అనంతరం స్పందించిన సీదిరి అప్పలరాజు, కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
పోలీసు అరెస్టులకు తాను భయపడనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, తాత్కాలిక బెయిల్ పిటిషన్లను సోంపేట ఆరో అదనపు జిల్లా జడ్జి కోడూరు కిశోర్‌బాబు కొట్టివేశారు.
మరోవైపు, సీదిరి అప్పలరాజు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేశారు.