LOADING...
Ex-PM Gujrals Son: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ.. వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
వాట్సాప్ డీపీతో ఘరానా మోసం

Ex-PM Gujrals Son: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ.. వాట్సాప్ డీపీతో ఘరానా మోసం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆయన పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన దుండగులు, కార్యాలయ సిబ్బందిని నమ్మించి ఏకంగా రూ.7.80 కోట్లను కాజేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

వివరాలు 

వాట్సాప్ డీపీతో సరికొత్త మోసం

సైబర్ నేరగాళ్లు నరేష్ కుమార్ గుజ్రాల్ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టుకుని ఆయన కార్యాలయ ఉద్యోగికి సందేశాలు పంపారు. తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, వెంటనే ఆర్టీజీఎస్ ద్వారా నిర్దేశించిన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని సూచించారు. అవతలి వ్యక్తి తన యజమానేనని భావించిన ఉద్యోగి ఎలాంటి అనుమానం లేకుండా రూ.7.80 కోట్లను ఆ ఖాతాకు బదిలీ చేశాడు.

వివరాలు 

అప్రమత్తతతో బయటపడిన అసలు విషయం

ఈ భారీ లావాదేవీపై అనుమానం వచ్చిన ఉద్యోగి, నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించగా,తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో తాము సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన దీక్షా గుజ్రాల్, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేసి ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రూ.4కోట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైమ్ అధికారులు వెంటనే స్పందించి, డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. దీంతో మొత్తం సొమ్ములో దాదాపు రూ.4కోట్లు, అంటే 70 శాతానికి పైగా నిధులను ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బు జాడను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

వివరాలు 

ఎవరీ నరేష్ కుమార్ గుజ్రాల్?

వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నరేష్ కుమార్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన 2007 నుంచి 2022వరకు పంజాబ్ తరఫున రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. 2004లోక్‌సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తండ్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997-98మధ్యకాలంలో భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. మనీ ట్రైల్‌పై దర్యాప్తు ఈ భారీ సైబర్ మోసం వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. మోసపూరితంగా బదిలీ అయిన నిధులు ఏ ఖాతాలకు వెళ్లాయి,వాటిని ఎక్కడికి తరలించారనే'మనీ ట్రైల్'నుఅధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Advertisement