Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్
మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం మరింత ముదురుతోంది. మాల్దీవులను బహిష్కరించాలన్న భారత్ పిలుపుపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమ దేశ పర్యాటక రంగంపై ప్రభావం చూపిందన్నారు. మాల్దీవుల ప్రజల తరపున ఆయన భారత్‌కు క్షమాపణలు చెప్పారు. మహ్మద్ నషీద్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత భారతదేశంలోని సోషల్ మీడియాలో మాల్దీవులను బహిష్కరించాలని ప్రచారం జరిగింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది.
మళ్లీ భారతీయులు మాల్దీవులకు రావాలి: నషీద్
మాల్దీవుల్లో భారతీయ పర్యాటకుల సంఖ్య పడిపోవడంపై మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా జరిగినందుకు తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ నుంచి ప్రజలు వారి సెలవుల్లో మాల్దీవులకు రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ ఆతిథ్యంలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రలను ప్రభుత్వం నుంచి తొలగించారని అన్నారు. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య బంధం తిరిగి పూర్వ స్థితికి రావాలని ఆయన ఆశించారు. భారత్-మాల్దీవుల సంబంధాలకు సంబంధించి అధ్యక్షుడు ముయిజ్జు విధానాలపై మహ్మద్ నషీద్ మండిపడ్డారు.