Rajasthan: నలుగురి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. దర్యాప్తులో బయటపడిన అసలు నిజం
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ఘటన సంచలనం సృష్టించింది. తొలుత రహదారి ప్రమాదంగా భావించిన ఈ సంఘటన వెనుక పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నలుగురు కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన మహిళ,అనంతరం ఏమీ తెలియనట్లు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపింది. గురువారం అజ్మేర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో సమీపంలోని పొలాల్లో కత్తిపోట్ల గాయాలతో మరో వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి, ఆయన తల్లి, రెండో భార్య, మేనకోడలుగా గుర్తించారు.
వివరాలు
కుమార్తె, మైనర్ కుమారుడితో కలిసి హత్యలు..
దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ సర్పంచ్ తొలి భార్య సునీతే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. రామ్‌సింగ్,సునీతకు 2005లో వివాహం జరగ్గా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సునీతకు ఇష్టం లేకుండానే రామ్‌సింగ్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగా కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సునీత తన కుమార్తె సరిత,మైనర్ కుమారుడితో కలిసి రామ్‌సింగ్‌ను హత్య చేయాలని పథకం రచించింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ముందుగానే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే రాత్రి నిద్రిస్తున్న రామ్‌సింగ్‌పై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశారు.అనంతరం ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురినీ చంపేశారు.
వివరాలు
సునీత,కుమార్తె,మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నేరాన్ని ప్రమాదంగా చూపించేందుకు మృతదేహాలను కారులోకి ఎక్కించి ఇంటికి దూరంగా తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించారు. కాలిపోవడానికి ముందే బాధితులు చనిపోయినట్లు ఫారెన్సిక్ రిపోర్ట్‌లో తేలింది. దర్యాప్తు సమయంలో మైనర్ బాలుడు కూడా నేరాన్ని అంగీకరించడంతో కేసులో కీలక ఆధారాలు లభించాయి. దీంతో సునీత, ఆమె కుమార్తె సరితతో పాటు మైనర్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బాధితుల ఇంటికి వెళ్లినప్పుడు సునీత ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తూ గుండెలు బాదుకుంటూ రోదించిందని అధికారులు తెలిపారు. ఆమె నటన కారణంగా తొలుత అనుమానం రాలేదని వెల్లడించారు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలు, విచారణలో బయటపడిన వివరాల ఆధారంగా చివరకు హత్యలకు పాల్పడింది సునీతేనని నిర్ధారణకు వచ్చారు.