LOADING...
SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!
టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!

SLBC Tunnel Rescue: టన్నెల వద్ద ఉత్కంఠ భరిత క్షణాలు.. కీలక దశకు చేరుకున్న ఆపరేషన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ లో రెస్క్యూ ఆపరేషన్‌ కీలక దశకు చేరుకుంది. వారం రోజులుగా NDRF, SDRF, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి బృందాలతో పాటు ర్యాట్ మైనింగ్ టీమ్స్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగంలో ధ్వంసమైన బోరింగ్‌ మిషన్‌ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా రంగంలోకి దిగింది. ప్లాస్మా కట్టర్‌ సహాయంతో మెషిన్‌ భాగాలను వేరు చేస్తూనే, మరోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాల ద్వారా బయటికి తరలిస్తున్నారు. కార్మికుల జాడను కనుగొనడానికి అత్యాధునిక స్కానర్‌ను వినియోగిస్తున్నారు. గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (GPR) ద్వారా సొరంగంలో పరిశీలనలు కొనసాగుతున్నాయి. పైకప్పు కూలిన ప్రాంతంలో మట్టి, శిథిలాల కింద ఉన్న వివరాలను నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

Details

టన్నెల్‌ వద్ద ఆక్సిజన్‌ సహా అత్యవసర వైద్య పరికరాలు

NGRI సూచించిన ఐదు కీలక ప్రాంతాల్లో GPR ద్వారా గుర్తించిన లొకేషన్లలో సహాయక బృందాలు డ్రిల్లింగ్‌ చేపట్టాయి. దీంతో నేటి రెస్క్యూ ఆపరేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆ లొకేషన్లలో ఏమి తేలుతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం, టన్నెల్‌ వద్ద ఆక్సిజన్‌ సహా అత్యవసర వైద్య పరికరాలు, అంబులెన్సులను సిద్ధం చేసింది. టన్నెల్‌లో బురద, నీటి స్రావం (సీపేజ్), TBM మిషన్‌ శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అయితే టన్నెల్‌లో నీటి స్రావం పెరుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కొంత అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. కన్వేయర్‌ బెల్ట్‌ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయి, ఇవాళ ఈ వ్యవస్థ సిద్ధమైతే సహాయక చర్యలు మరింత వేగంగా సాగనున్నాయి.

Details

 అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దు 

GPR పరికరంతో సేకరించిన చిత్రాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెత్తని భాగాలను గుర్తించిన ప్రదేశాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశారు. సోషల్‌ మీడియాలో కార్మికుల ఆచూకీపై వస్తున్న వదంతులను నమ్మొద్దని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆందోళన టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల గురించి ఎలాంటి సమాచారం అందించలేదని, వారిని చూడటానికి అనుమతి ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. టన్నెల్‌లోని మెత్తని భాగాలేవి? అక్కడ చిక్కుకున్న కార్మికులు, ఇద్దరు ఇంజినీర్ల ఆచూకీ ఏమిటనేది ఇవాళ ఓ కీలక అప్‌డేట్‌ వచ్చే అవకాశముంది.