LOADING...
Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు
ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు

Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన ఎవరి పౌరసత్వం కూడా రద్దైనట్లుగా భావించరాదని స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించిన ధర్మాసనం ఎన్నికల సంఘం అధికారాల పరిమితిని కూడా వెల్లడించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కేవలం ఎన్నికల నిర్వహణకే సంబంధించినదని తెలిపింది. ఒకరి పేరు ఓటరు జాబితాలో చేర్చాలా లేదా తొలగించాలా అన్న నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికే ఉంటుందని పేర్కొంది. అంతేకానీ ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి లేదని తెలిపింది.

వివరాలు 

పౌరులని తేలితే ఓటు హక్కు పునరుద్ధరణ

పౌరసత్వంపై అనుమానం ఉన్న కారణంగా ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి వివరాలను కేంద్ర హోం శాఖకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని పేర్కొంది. అనంతరం పౌరసత్వ చట్టం-1955 ప్రకారం ఆయా వ్యక్తుల పౌరసత్వ హక్కులపై కేంద్రం విచారణ చేపట్టాలని సూచించింది. తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ పరిశీలన పూర్తిచేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ అనంతరం వారు భారత పౌరులేనని నిర్ధారణ అయితే వెంటనే వారి పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఆరోపణలకు కొంతవరకు ముగింపు లభించినట్లైంది.

Advertisement