Page Loader
Railway: సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు
సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు

Railway: సికింద్రాబాద్‌- కాజీపేట రైల్వే మార్గంలో రద్దీ సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన సికింద్రాబాద్‌-కాజీపేట రైల్వే మార్గంపై ఎదురవుతున్న రద్దీ సమస్యను తీర్చేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఘట్‌కేసర్‌ నుంచి కాజీపేట వరకు ఉన్న 110.46 కిలోమీటర్ల మార్గంలో కేవలం రెండు రైలు లైన్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో రెండు అదనపు రైలు లైన్ల నిర్మాణానికి సంబంధించి తుది సర్వే ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను(డీపీఆర్‌)దక్షిణ మధ్య రైల్వే ఇటీవల రైల్వే బోర్డుకు పంపింది. ఈ కొత్త లైన్ల నిర్మాణానికి రూ.2,837 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయబడింది. రైల్వే బోర్డు నుండి ఆమోదం లభిస్తే,ఈ ప్రాజెక్టు అధికారికంగా మంజూరవుతుంది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల్లో నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

వివరాలు 

సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం 100శాతం మించకూడదు

సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రంగా ఉండటంతో, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు.. దిల్లీ,చండీగఢ్‌, వారణాసి,ప్రయాగ్‌రాజ్‌,లఖ్‌నవూ వంటి నగరాలకు చేరేందుకు కాజీపేట మార్గాన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే, విజయవాడ,విశాఖపట్నం,కోల్‌కతా దిశగా వెళ్లే రైళ్లు కూడా ప్రధానంగా కాజీపేట రూట్‌ మీదే ప్రయాణిస్తాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు,గూడ్స్‌ రైళ్ల వల్ల తీవ్ర రద్దీ నెలకొంది. సాధారణంగా సెక్షన్‌ ట్రాక్‌ కెపాసిటీ వినియోగం 100శాతం మించకూడదు. కానీ ప్రస్తుతం ఇది 128శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మూడు,నాలుగు లైన్ల నిర్మాణం ద్వారా రద్దీ సమస్యను తగ్గించడంతో పాటు, రైళ్ల రాకపోకలను వేగవంతంగా నిర్వహించే అవకాశముంది. అదనంగా, గూడ్స్‌ రైళ్ల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయవచ్చునన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

వివరాలు 

రాయగిరి నుంచి కాజీపేట వరకు 3, 4 లైన్లు

ఇక సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఇప్పటికే నాలుగు రైల్వే లైన్లు ఉన్నా, ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్ట్‌ కింద మూడో లైన్‌ ఇప్పటికే మంజూరైంది. ఇప్పుడు ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు నాలుగో లైన్‌, అలాగే రాయగిరి నుంచి కాజీపేట వరకు మూడో, నాలుగు లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.