Loading...
Rajasthan Railway Track Blast: భారత్‌-పాక్‌ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఇద్దరు అరెస్ట్‌!
భారత్‌-పాక్‌ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఇద్దరు అరెస్ట్‌!

Rajasthan Railway Track Blast: భారత్‌-పాక్‌ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై పేలుడు.. ఇద్దరు అరెస్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని గంగానగర్‌ జిల్లాలో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో రైల్వే ట్రాక్‌ను పేల్చి ప్రమాదం సృష్టించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవంబర్‌ 3న రామ్‌సింగ్‌పూర్‌ సమీపంలోని రైల్వే పట్టాలపై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రాక్‌లో కొంతభాగం ధ్వంసమైంది. అక్కడ రెండున్నర అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. అయితే, ఆ సమయంలో పట్టాలపైకి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాలు

పేలుడుతో రైళ్ల రాకపోకలు నిలిపివేత

రైల్వే ట్రాక్‌ ధ్వంసమైన విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

దీంతో అధికారులు అప్రమత్తమై ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాజస్థాన్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) సహకారంతో 21 ఏళ్ల మహక్‌దీప్‌ కౌర్‌, 22 ఏళ్ల దవిందర్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు.

వివరాలు

ఐఎస్‌ఐతో యువతి సంప్రదింపులు?

నిందితులకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన యువతి ఐఎస్‌ఐ (ISI)తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు.

ఆమె భర్త మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒంటరిగా ఉన్న పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లు దేశంలో దాడులకు కుట్ర పన్నుతున్నారని పోలీసులు వెల్లడించారు.

రైల్వే ట్రాక్‌పై పేలుడు సృష్టించేందుకు సదరు మహిళకు వారు డబ్బులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని తెలిపారు.

ఆయుధాలు, తూటాలు స్వాధీనం

నిందితురాలి వద్ద నుంచి రెండు ఆయుధాలు, 46 తూటలు, రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ADVERTISEMENT