Chandigarh : బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు.. ఛండీగఢ్‌లో స్కూటర్ బ్లాస్ట్..
ఈ వార్తాకథనం ఏంటి
చండీగఢ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యాలయం సమీపంలో జరిగిన భారీ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయం బయట పార్క్ చేసి ఉంచిన స్కూటీ వద్ద ఈ పేలుడు చోటుచేసుకోవడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. బుధవారం సాయంత్రం చండీగఢ్ సెక్టార్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, సాయంత్రం 5 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది.
వివరాలు
ఘటనపై పోలీసులు కేసు నమోదు
అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, ప్రాథమిక విచారణలో ఇద్దరు అనుమానితులు ద్విచక్ర వాహనంపై వచ్చినట్లు బాంబు లేదా ఐఈడీ విసిరి అక్కడి నుంచి వేగంగా పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పేలుడు ఘటనతో చండీగఢ్ నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.