Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం!
హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ద్వారా నూకలు, బియ్యం తదితర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నూకల ఎగుమతికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన హాకా, త్వరలోనే బియ్యం ఎగుమతులను కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు, హాకా వివిధ ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన సరుకులను, ఫర్నిచర్‌ను సరఫరా చేస్తోంది. అయితే ఇటీవల రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, లాభం కోసం భారీ ఎత్తున ఎగుమతులను చేపట్టాలని సంస్థకు సూచనలు చేశారు.
త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి
హాకా ఇప్పటికే నూకల ఎగుమతిపై దృష్టి పెట్టగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నూకలకు డిమాండ్ ఉందని తెలిసి కేంద్రం నుండి అనుమతులు పొందింది. తెలంగాణ బియ్యం దిగుమతికి ఇతర రాష్ట్రాలు, అలాగే విదేశాల నుంచి ఆసక్తి చూపుతున్నాయని మంత్రి చెప్పారు. ఫిలిప్పీన్స్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం ఎగుమతులు ప్రభుత్వ సంస్థలు చేపట్టలేదు. కానీ ప్రైవేటు వ్యాపారులు ఈ రంగంలో ఉన్నారు. హాకా ముందుకు వస్తుండటంతో బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా అనుమతి పొందనుంది. ఇందుకు కావాల్సిన కేంద్ర అనుమతుల కోసం త్వరలో దరఖాస్తు చేసుకోవాలని హాకా భావించింది. ఈ అంశంపై మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాయనున్నారు.