
Amaravati: అమరావతి పర్యావరణ అనుమతుల కోసం సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరానికి పర్యావరణ అనుమతులు పొందడం కోసం సీఆర్డీఏ (CRDA) సలహా సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (Expression of Interest - EOI) ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో ఎంపికైన సంస్థకు రాజధాని పరిధిలో ఉన్న 217.23 చదరపు కి.మీ భూభాగంతో పాటు, పరిధి సరిహద్దు నుంచి 10 కి.మీ దూరంలో పర్యావరణ ప్రభావాలపై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సర్వేపై నిపుణులు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిబంధనలు, ఉత్తమ ఆచరణ విధానాలు (Best Practices) ప్రకారం పర్యావరణహిత చర్యలను రూపొందించి, సూచించాలి.
వివరాలు
ఎంపికైన సంస్థ పూర్తి అధ్యయన నివేదిక.. సీఆర్డీఏకు సమర్పించాలి
ఈ అధ్యయనంలో ప్రత్యేకంగా మునుపటి పరిశోధనలతో పాటు కొత్త ప్రదేశాలలో గాలిలో కలుషితాలు, భూగర్భ జలాల పరిస్థితి,మట్టితత్వం,ధ్వని మానదండం వంటి అంశాలపై సర్వే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా,రాజధానిలో సామాజిక ప్రభావం,విద్యుత్ వినియోగ విధానం,నీటి పరిరక్షణ, జీవ వైవిధ్యం, జీవావరణ పరిరక్షణ చర్యలు,హరితాభివృద్ధి కార్యక్రమాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర అధ్యయనం చేయడం తప్పనిసరి. బిడ్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలుగా నిర్ణయించారు. అదేరోజు సాయంత్రం 4గంటలకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను(EOI) తెరవనున్నట్లు సీఆర్డీఏ ప్రకటించింది. ఎంపికైన సంస్థకు మూడు నెలల లోపే పూర్తి అధ్యయన నివేదికను సిద్ధం చేసి సీఆర్డీఏకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది.