2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ.. జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు జేపీ నడ్డానే బీజేపీ చీఫ్‌గా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నడ్డా నాయకత్వంలో బిహార్, మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలను గెల్చుకున్నట్లు షా తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో గెలిచామని, పశ్చిమ బెంగాల్‌లో తమ సంఖ్య పెరిగిందని, గుజరాత్‌లో కూడా ఘనవిజయాన్ని సాధించామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మోదీజీ నాయకత్వంలో నడ్డా పార్టీని 2019 కంటే ఎక్కువ సీట్లలో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా.
జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలకమైన రాజకీయ నిర్ణయాలు
దిల్లీలో రెండురోజులుగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ క్రమంలోనే కీలకమైన రాజకీయ నిర్ణయాలను తీసుకున్నారు. అందులో భాగంగనే నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ ముఖ్యమంత్రులతో సహా ఇతర అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణతో పాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు తోడ్పడుతాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.