
British F 35 Fighter Jet: ఎఫ్-35 యుద్ధ విమానం కేరళలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బీ యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా, ఇంధనం లోపించిందన్న కారణంతో ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది. యూకేకు చెందిన 'హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్' క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన ఈ ఐదో తరానికి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇటీవలి రోజుల్లో ఈ గ్రూప్ భారత నావికాదళంతో కూడిన యుద్ధ విన్యాసాల్లో కూడా పాలుపంచుకుంది. ఈ విమానం తీర ప్రాంత దేశంలో అత్యవసరంగా ల్యాండ్ కావడం అరుదైనదైనా, అంతగా ఆశ్చర్యపెట్టేదిగా కాదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Details
వాతావరణ పరిస్థితులే కారణం
విమానం వాహకనౌకపై ల్యాండింగ్ ఎందుకు సాధ్యపడలేదన్న దానిపై స్పష్టత లేదు. హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చుట్టూ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. ఎఫ్-35బీ వేరియంట్ స్వల్ప దూరం నుంచి టేకాఫ్ అవుతూ, నిలువుగా ల్యాండ్ అయ్యే సాంకేతికతతో తయారు చేశారు. ఇది ప్రధానంగా వాయుసేనకు కాకుండా, నౌకాదళం వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో స్టెల్త్ ఫీచర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, డేటా షేరింగ్ సామర్థ్యం ఉండటంతో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, నాటో దేశాల వైమానిక దళాల్లో దీనికి ప్రాధాన్యత ఎక్కువైంది. ఈ అత్యవసర ల్యాండింగ్‌పై యూకే రక్షణ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇది రూటీనే అయినా, విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న జాగ్రత్త చర్యగా భావిస్తున్నారు.