AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం ఏమి చెప్పిందంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలుఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వినిపించాయి. ఉమ్మడి కడప, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూటమి ఈ డిమాండ్లపై హామీలు ఇచ్చింది, ముఖ్యంగా మార్కాపురం,హిందూపురం కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నవి. రాజంపేటకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చినట్టు సమాచారం.
26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కొత్త జిల్లాల డిమాండ్లు మరింత స్పష్టమయ్యాయి. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా మారబోతున్నాయని, కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక డాక్యుమెంట్ వైరల్ అవుతోంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అలాగే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో మార్పులు చేయడం గురించి ప్రచారం జరుగుతోంది. ఒకటి లేదా రెండు జిల్లాలను రద్దు చేయడం గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అనకాపల్లి జిల్లా రద్దు.. పూర్తిగా అవాస్తవం
కొత్త జిల్లాల ఏర్పాటు,ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. 'ఒక సాధారణ వ్యక్తి ఇచ్చిన సలహాను ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతిని కలిగించేందుకు కొంతమంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని' అన్నారు. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం'అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌ను ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ జిల్లాల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు పేర్కొన్నారు.
జిల్లాల సంఖ్యను పెంచి ఐదు క్లస్టర్లు ఏర్పాటు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్‌లో రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించినట్టు ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తర రాయలసీమగా ఏర్పాటుకు సూచనలు ఇచ్చారు. ఈ క్లస్టర్లలో ఏ జిల్లాలను చేర్చాలో, కొత్త జిల్లాలు ఏవి ఏర్పాటు చేయాలో, ఏ జిల్లాలను రద్దు చేయాలో వంటి అంశాలను పొందుపరిచారు. ఈ డాక్యుమెంట్ వైరల్ చేయడం ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం చేయడం పై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది.