Pawan kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. విచారణకు హోంమంత్రి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు వెల్ఫేర్ పథకాలను అందిస్తూ, రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతోంది. ఇటీవల విజయవాడలో జరిగిన వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చి, సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు.
గరివిడి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు
పర్యటన సందర్భంగా సున్నితమైన ప్రాంతంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఒక ఐపీఎస్ అధికారి దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిసింది. ఆయన చుట్టూ తిరిగిన వ్యక్తి కేవలం ఫేక్ ఐపీఎస్ అధికారి అని ఆరా తీసిన తర్వాత అధికారులు వెల్లడించారు. ఆయన విజయనగరంలో గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.