Fact Check: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌పై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం వేదికగా వివరణ ఇచ్చింది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ.611.80 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేందుకు భారత విమానాశ్రయాల అథారిటీ (ఏఏఐ)తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
వివరాలు
4,618 ఎకరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం
అలాగే అమరావతి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్ట్ మాత్రమేనని ప్రభుత్వం వివరించింది. రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామ సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా, విమానాల మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దడమేనని పేర్కొంది. కొత్త విమానాశ్రయం వచ్చినప్పటికీ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
వివరాలు
ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండటం సాధారణమే
మెట్రో నగరాలు, అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండటం సాధారణమేనని ప్రభుత్వం ఉదాహరణలు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాలు ఒకేసారి కొనసాగుతున్నట్లే, అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చినా గన్నవరం విమానాశ్రయం కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత వార్త పూర్తిగా అవాస్తవం. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రూ. 611.80 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (New Integrated Terminal Building - NITB) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనిని… pic.twitter.com/OddQNAARcS
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) May 16, 2026