Page Loader
Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 
Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్

Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 

వ్రాసిన వారు Stalin
Feb 20, 2024
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కొనుగోలు చేయడానికి ఐదేళ్ల ఒప్పందాన్ని కేంద్ర తరఫున వచ్చిన ముగ్గురు కేంద్ర మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. ఎంఎస్‌పీ చట్టబద్ధ హామీ తప్ప తమకు ఏది కూడా ఆమోదయోగ్యం కాదని రైతు నాయకులు కేంద్రం ప్రభుత్వ ప్రతినిధులతో తేల్చి చెప్పారు. ఈ ఐదేళ్ల ప్రతిపాదనను ఆదివారం రైతులతో జరిగిన చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. అయితే సోమవారం రైతు సంఘాల వేదికలపై చర్చించిన నాయకులు.. కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు.

రైతులు

చర్చలకు ఎప్పుడూ సిద్ధమే: రైతు నేత

చర్చలు విఫలమైన నేపథ్యంలో ఫిబ్రవరి 21న చలో దిల్లీ మార్చ్‌ను చేపట్టోబతున్నట్లు రైతు నాయకుడు పధేర్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వంతో తదుపరి సమావేశం ఉండదన్నారు. అయితే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమే అన్నారు. తమ డిమాండ్లను అంగీకరించాలని లేదా దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని మరో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ వివరించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్‌గా లేదన్నారు. 23 పంటలకు ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర కోసం ఫార్ములాను ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రభుత్వం రూ.1.75లక్షల కోట్ల విలువైన పామాయిల్‌ను బయటి నుంచి కొనుగోలు చేస్తుందని, ఆ మొత్తాన్ని నూనె గింజలకు వ్యవసాయానికి కేటాయిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని దల్వాల్ పేర్కొన్నారు.

రైతులు

రైతుల డిమాండ్‌ ఏమిటి?

రైతుల అతిపెద్ద డిమాండ్ ఎంఎస్‌పిపై చట్టపరమైన హామీ. ప్రభుత్వం ఎంఎస్పీపై చట్టం తీసుకురావాలని రైతులు అంటున్నారు. ఎంఎస్‌పిపై స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎంఎస్‌పికి హామీ ఇచ్చే చట్టం తీసుకువస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు అది జరగలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. స్వామినాథన్ కమిషన్ రైతులకు వారి పంటల ధరకు ఒకటిన్నర రెట్లు చెల్లించాలని సిఫారసు చేసింది. కమిషన్ నివేదిక వచ్చి 18 ఏళ్లు గడిచినా, ఎంఎస్‌పీపై సిఫార్సులు ఇంకా అమలు కాలేదని రైతులు అంటున్నారు. దీంతోపాటు పింఛన్‌, రుణమాఫీ, విద్యుత్‌ ఛార్జీలు పెంచరాదని, లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో బాధితులైన రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.