Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయి కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్-బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా, లారీ వారి వైపు దూసుకొచ్చింది. ఈ సంఘటనతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. లారీ వేగంతో చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.