Page Loader
FATF: పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్‌ఏటీఎఫ్‌
పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్‌ఏటీఎఫ్‌

FATF: పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్‌ఏటీఎఫ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 'ఆర్థిక చర్యల కార్యదళం' (FATF) తీవ్రంగా ఖండించింది. ఈ దాడితో పాటు ఇటీవలి ఇతర ఉగ్రదాడుల గురించి కూడా ప్రస్తావించిన FATF, ఇవన్నీ ఉగ్రవాద మద్దతుదారుల మధ్య నిధుల తరలింపు మార్గాలు లేకుండా జరగలేవని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునేందుకు దేశాలు తీసుకుంటున్న చర్యలపై మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. త్వరలో ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేయనున్నట్లు FATF ప్రకటించింది.

వివరాలు 

FATF నుంచి ఖండన అరుదైనదని

''ఉగ్రదాడులు ప్రపంచవ్యాప్తంగా పౌరుల ప్రాణనష్టానికి కారణమవుతున్నాయి. అవి సమాజంలో భయాన్నికలిగిస్తున్నాయి. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన అమానుషమైన ఉగ్రదాడిని మేము ఖండిస్తున్నాం. ఇటీవలి మరికొన్ని దాడులు కూడా నిధుల ప్రవాహం లేకుండా జరగలేవని స్పష్టమైంది'' అని FATF అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఉగ్రచర్యలపై FATF నుంచి ఇటువంటి ఖండన అరుదైనదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత దశాబ్దంలో FATF సంస్థ కేవలం మూడుసార్లే ఈ తరహా ఖండనలను వెల్లడించినట్లు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి అండగా నిలుస్తోంది,ఆయుధాల కోసం నిధులు సమీకరిస్తోంది అనే అంశాలపై భారత్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో FATF ఈ ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

FATF 'గ్రే లిస్ట్‌'లో ప్రపంచవ్యాప్తంగా 24దేశాలు

వచ్చే ఆగస్టులో జరగనున్న FATF ఆసియా-పసిఫిక్ గ్రూప్ సమావేశం,అలాగే అక్టోబర్‌లోని FATF ప్లీనరీ, వర్కింగ్ గ్రూప్ సమావేశాల నేపథ్యంలో భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌ ఉగ్ర మద్దతు చరిత్రపై ఆధారాలను సేకరిస్తోంది. దాయాది దేశాన్ని మరోసారి FATF 'గ్రే లిస్ట్‌'లో చేర్చేలా సమగ్ర డాక్యుమెంటేషన్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనీలాండరింగ్‌,టెర్రర్ ఫైనాన్సింగ్‌పై FATF ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24దేశాలు FATF 'గ్రే లిస్ట్‌'లో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలపై గట్టి పర్యవేక్షణ కొనసాగుతుంది. పాకిస్థాన్‌ 2008,2012,2018 సంవత్సరాల్లో ఈ జాబితాలో చేర్చబడింది. చివరిసారి 2022లో 'గ్రే లిస్ట్‌' నుంచి బయటపడింది.అయితే,పాకిస్థాన్‌ తాజా చర్యలు తిరిగి ఆ దేశాన్ని FATF పర్యవేక్షణ జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.