Punjab Police: పంజాబ్ పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ డ్రగ్ డీలర్..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా సహా పలు దేశాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందెర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని పంజాబ్ డీజీపీ సోషల్ మీడియాలో వెల్లడించారు.
నార్కోటిక్స్ సిండికేట్‌లో అతను ప్రధాన భూమిక పోషిస్తున్నాడని, కొలంబియా నుంచి అమెరికా, కెనడాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.
షెహనాజ్ అక్రమాలపై అమెరికా ఎఫ్‌బీఐ ప్రత్యేక నిఘా పెట్టగా, ఫిబ్రవరి 26న అతడి అనుచరులు అరెస్టయ్యారు.
వారి నుంచి 391 కేజీల మెథంఫెటమైన్, 109 కేజీల కొకైన్, నాలుగు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
పంజాబ్ తర్న్ తరణ్ పోలీసులు రహస్య ఆపరేషన్
ఈ పరిణామాల నేపథ్యంలో షెహనాజ్ భారత్ చేరుకున్నాడు. దీనిపై నిఘా వర్గాల సమాచారం అందుకున్న పంజాబ్ తర్న్ తరణ్ పోలీసులు రహస్యంగా అతడి కదలికలపై పక్కా ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించారు.
ఆపరేషన్ విజయవంతమవడంతో అతడిని అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలను నిరోధించేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు.
పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్ స్మగ్లర్లు, క్రిమినల్స్‌కు స్వర్గధామంగా మారనివ్వమని వారు హెచ్చరించారు.